సినిమా రంగంలో కొన్ని సందర్భాల్లో సినిమా కథల విషయంలోగానీ, మ్యూజిక్ డైరెక్టర్ చేసిన పాటల విషయంలోగానీ కొన్ని వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ సినిమా కథ తనదని లేదా ఆ సినిమాలో వాడిన ట్యూన్ తనదేనని కొందరు తెరపైకి వస్తుంటారు. అలాంటి ఓ వివాదంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ ఇరుక్కున్నారు. దానికోసం రూ.4 కోట్లు చెల్లించాడు. చిన్న పొరపాటుకి అంత పెద్ద ఎమౌంట్ ఎందుకు పే చెయ్యాల్సి వచ్చింది అనేది తెలుసుకుందాం.
తెలుగులో రాజమౌళి చేసిన సినిమాలన్నింటికీ కీరవాణి సంగీతం అందిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే బాలీవుడ్లో రాకేష్ రోషన్ డైరెక్ట్ చేసిన లేదా నిర్మించిన సినిమాలన్నింటికీ అతని సోదరుడు రాజేష్ రోషన్ మ్యూజిక్ ఇస్తాడు. 2008లో జుహీ చావ్లా, అర్షద్ వార్సి, ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో ‘క్రేజీ4’ అనే సినిమాను నిర్మించాడు రాకేష్ రోషన్. ఈ సినిమాలోని ఓ పాట వల్ల ఏర్పడిన వివాదం గురించి దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ సినిమా పాటల రికార్డింగ్ జరుగుతున్నప్పుడు రాకేష్ రోషన్‌కి ఒక సలహా ఇచ్చాడు హృతిక్. తను విన్న ఓ జింగిల్ అద్భుతంగా ఉందని, దాన్ని తమ సినిమాలోని పాటకు ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పాడు. అది రాకేష్‌కి కూడా బాగా నచ్చింది. ఆ జింగిల్ ఏ యాడ్ కంపెనీదో కనుక్కొని వారిని సంప్రదించారు రాకేష్. జింగిల్లోని ట్యూన్ తను వాడుకుంటానని చెప్పడంతో.. ఆ యాడ్ కంపెనీ ఎన్ఓసి కూడా ఇచ్చింది. ఆ పాటను రికార్డ్ చేశారు. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది.
అప్పుడు ఆ జింగిల్‌ని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రంగంలోకి దిగి.. తన ట్యూన్‌తో పాట చేశారని ఆరోపించారు. తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ పట్టుపట్టాడు. ఆ సమయంలో ఆ యాడ్ కంపెనీకి ఆ మ్యూజిక్ డైరెక్టర్ టచ్‌లో లేడు. చివరికి ఇది కోర్టు వరకు వెళ్లింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కి అనుకూలంగానే తీర్పు రావడంతో రాకేష్ రోషన్ రూ.4 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అతను కోర్టులో గెలవడానికి హృతిక్ రోషన్ చేసిన ఓ మెసేజ్ బలాన్నిచ్చింది. కోర్టులో ఈ కేసు వుండగానే ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కి ‘చిన్న జింగిలే కదా.. దీనికి ఇంత రాద్ధాంతం చేయడం, నాన్నగారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు?’ అని ఓ మెసేజ్ పంపాడు హృతిక్. దీంతో అతని జింగిల్‌ని రాకేష్ రోషన్ బృందం తస్కరించిందని అధికారికంగా ప్రూవ్ అయింది. ఆ విధంగా హృతిక్ రోషన్ చేసిన చిన్న మెసేజ్ వల్ల రాకేష్ రోషన్ రూ.4 కోట్లు నష్టపోయాడు.